Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు

- ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా
- హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్ గుప్తాకు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించి హరీశ్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. దీంతో ఆయన కొన్నిరోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆ నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమితులయ్యారు. గుప్తా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో డీజీపీ స్థానానికి ఆయన తర్వాత సీనియారిటీ పరంగా అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ (1991 బ్యాచ్) ఉన్నారు.
అయితే శాంతి భద్రతల విభాగంతో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగా, ఎన్నికల సమయంలో డీజీపీగానూ పనిచేసిన అనుభవం ఉన్న హరీశ్ కుమార్ గుప్తా పనితీరుపై సంతృప్తితో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నూతన పోలీస్ బాస్‌గా ఆయనను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

