Kumbhamela: మహా కుంభమేళా తొక్కిసలాట విచారకరం... పెద్ద కార్యక్రమంలో చిన్న సంఘటనలు సహజం: యూపీ మంత్రి

- మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి
- తొక్కిసలాట ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్నారన్న మంత్రి
- వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సంజయ్ నిషాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన, ఇంత పెద్ద కార్యక్రమంలో 'చిన్న సంఘటనలు' సహజంగా జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో నిషాద్ మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇంతటి భారీ కార్యక్రమంలో, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయని విచారం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు.
ఈ తొక్కిసలాట ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పుణ్యస్నానమాచరించాలని సూచించారు. వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మహా కుంభమేళా నిర్వహణలో లోపాలు ఉన్నాయని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ మహా కుంభమేళాకు భక్తకోటి తరలి వచ్చారని, ప్రపంచంలో మరెక్కడా ఇలా ఒకే వేదిక పైకి ఇంతమంది రాలేదని అన్నారు.
ఇది విషాదకర సంఘటన అని, ఈ ఘటన జరగడం తమను బాధించిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు.