Maha Kumbh: కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్య 30... యూపీ ప్రభుత్వ ప్రకటన

UP Govt announces 30 died in Kumbhmela

  • మహా కుంభమేళాలో విషాద ఘటన
  • తొక్కిసలాటలో ప్రాణనష్టం
  • ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపిన డీఐజీ

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో విషాద ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. గత అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. బారికేడ్లు విరిగిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగింది. అయితే, దీనికి సంబంధించి ఇప్పటివరకు మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. 

ఈ నేపథ్యంలో, మహాకుంభ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న డీఐజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారని వెల్లడించారు. 60 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. 

అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగిందని డీఐజీ పేర్కొన్నారు. బారికేడ్ల ధ్వంసం వల్లే తొక్కిసలాట జరిగిందని వివరించారు. ప్రజలు వివరాలు తెలుసుకునేందుకు '1920' హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News