Haryana: యమునా నదిపై కేజ్రీవాల్ వ్యాఖ్యల మీద కేసు నమోదు చేస్తాం: హర్యానా మంత్రి

- యమునా నదిని హర్యానా బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందన్న కేజ్రీవాల్
- కేజ్రీవాల్ అసంబద్ధమైన ఆరోపణలు చేశారన్న మంత్రి విపుల్ గోయల్
- నీటిని కలుషితం చేయడం జలఉగ్రవాదమన్న అతిషి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ తెలిపారు. యమునా నదిని బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ చేసిన నిరాధార ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తమ ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఆయన నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఉపేక్షించేది లేదన్నారు. దీనికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తామని వ్యాఖ్యానించారు.
హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని కేజ్రీవాల్ నిన్న ఆరోపించారు. నదిలో విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అతిశీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. యమునను కలుషితం చేయడం 'జల ఉగ్రవాదం'గా ఆమె అభివర్ణించారు.