Jagan: జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

Hearing on Jagan quash petition adjourned

  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మంత్రి నారాయణపై ఒక పత్రికలో వార్తలు
  • తన పరువుకు భంగం కలిగేలా ఉన్నాయంటూ పరువునష్టం దావా వేసిన నారాయణ
  • నేడు క్వాష్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు

తనపై నమోదైన పరువునష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. జగన్ తరపు న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపిస్తూ వరుసగా విచారణకు సమయం అడుగుతున్నారని... పిటిషన్ పై రెగ్యులర్ విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

పరువునష్టం కేసు వివరాల్లోకి వెళితే... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఒక పత్రికలో కథానాలు వచ్చాయి. సదరు పత్రిక కథనాలతో తన పరువుకు భంగం వాటిల్లిందని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో నారాయణ దావా వేశారు. దీనిపై ఆ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ జగన్ కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News