Rajamouli: ఇక్కడ వచ్చేది తక్కువ... అయినా ఎవరూ నమ్మరు: 'జబర్దస్త్' రాజమౌళి!
![Jabardasth Rajamouli Interview](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a15c825249.jpg)
- తాగుబోతు పాత్రలకు రాజమౌళి పెట్టింది పేరు
- చిన్నప్పటి నుంచి నాటకాలు అలవాటని వెల్లడి
- 'జబర్దస్త్'తో పేరు వచ్చిందని వివరణ
- ఆర్టిస్టుల దగ్గర డబ్బుల్లేవంటే నమ్మరని వ్యాఖ్య
'జబర్దస్త్' చూసినవారికి రాజమౌళి గుర్తుండకుండా ఉండడు. తాగుబోతు మాటలతోనే కాదు... పాటలతోను అలరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి రాజమౌళి ఇప్పుడు సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తనకు సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.
"చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. తాగుబోతులా నటించడమనేది కాలేజ్ రోజుల నుంచి ఉంది. నిజంగానే తాగేసి వచ్చాననుకుని స్టేజ్ పై నుంచి దింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 'జబర్దస్త్' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో నాగబాబుగారు నా స్కిట్స్ ను... నేను పాడే పేరడీ సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేసేవారు" అని అన్నాడు.
"నేను ఈవెంట్స్ చేస్తుంటాను... స్పెషల్ షోస్ చేస్తుంటాను... సినిమాలు కూడా చేస్తున్నాను. అందువలన డబ్బులు బాగా వస్తుంటాయని ఊళ్లో వాళ్లు అనుకుంటారు. ఇక్కడ వచ్చేది... ఇచ్చేది తక్కువే అని చెప్పినా నమ్మరు. ఇక్కడ ఎప్పుడు షూటింగులు ఉంటాయో... ఎప్పుడు ఉండవో తెలియదు. షూటింగులు లేకపోయినా ఖర్చులు ఆగవు. ఇవి దూరం నుంచి చూసేవారికి అర్థం కావు" అని చెప్పాడు.