DVB Swamy: సకల శాఖల మంత్రి అందినకాడికి దోచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు: మంత్రి డీవీబీ స్వామి

Minister DVB Swamy comments on YCP leaders

  • మంగళగిరిలో మంత్రి డోలా ప్రెస్ మీట్
  • వైసీపీ నేతలపై ధ్వజం
  • వైసీపీ నేతలు ఫేక్ ప్రపంచంలో బతికారని విమర్శలు
  • ప్రజలు ఎన్నికల్లో ఒక అరాచక శక్తిని తరిమికొట్టారని వెల్లడి 

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, ఒక అరాచక శక్తిని తరిమికొట్టారని వివరించారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశమిచ్చారని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, రూ. 4 లక్షల 40 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. 

"వైసీపీ వారు వాస్తవ ప్రపంచంలో బతకడం లేదు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రపంచంలో బతికారు. ప్రజలు ఛీత్కరించారు, తిరస్కరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఎంత అరచి గీ పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పే మాటలు ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు. ఫేక్ మీడియా ద్వారా మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దు. 

సకలశాఖ మంత్రి అందినకాడికి దోచుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పెద్దిరెడ్డి చేసిన పాపాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఎప్పుడు ఏవిధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. రాయలసీమలోని చిత్తూరు జిల్లాతోపాటు ప్రకాశం జిల్లాల్లో దారుణంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారు.  మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీటిపై ఎలుగెత్తాం. అవన్నీ అక్షర సత్యాలని ఇప్పుడు అర్థమవుతోంది. ఇంకా బయటికి రావాల్సిన పాపాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి.  

రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వైసీపీని  వదిలేసి బయటికి వస్తున్నారు. వైసీపీ నాయకుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నీ కేసుల మాఫీకి మోదీ కాళ్లు పట్టుకున్నావు. ప్రజల గురించి ఏనాడు పట్టించుకోలేదు. అందుకే ప్రజలు నిన్ను చీకట్లోకి నెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం కల్లబొల్లి మాటలు చెప్పావు. మూడు రాజధానులు అని మోసం చేశావు.  ప్రజలు నిన్ను నమ్మలేదు" అంటూ డోలా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News