ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ప్లేయర్లు... తిలక్ కెరీర్ బెస్ట్ ర్యాంక్!

Tilak Varma Rises to Career Best No 2 in ICC T20I Rankings

  • యువ ఆట‌గాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంకులు
  • బ్యాటింగ్ విభాగంలో తిల‌క్‌కు రెండో ర్యాంక్
  • బౌలింగ్ విభాగంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి ఐదో ర్యాంక్‌

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయ‌ర్లు సత్తా చాటారు. యువ ఆట‌గాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి అద‌ర‌గొట్టారు. ఇటీవ‌ల అద్భుతంగా రాణిస్తున్న‌ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ సిరీస్‌లో వ‌రుస‌గా రెండు శ‌త‌కాలు బాదిన తిల‌క్‌... ప్ర‌స్తుతం స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లోనూ బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. 

రెండో టీ20లో అజేయంగా 72 ప‌రుగులు చేసి, భార‌త జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రస్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ తిలక్ భారీ ఇన్నింగ్స్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. అదే ఇప్పుడు అత‌డిని కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించేలా చేసింది. ప్ర‌స్తుతం 832 రేటింగ్ పాయింట్స్ తో తిల‌క్ ఏకంగా రెండో స్థానంలో నిలిచాడు. 

ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855 రేటింగ్ పాయింట్స్‌) అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.

మరోవైపు బౌలింగ్ విభాగంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా టీ20 ర్యాంకింగ్స్ లో అద‌ర‌గొట్టాడు. ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న వరుణ్ ప్రస్తుతం 679 రేటింగ్ పాయింట్స్‌తో 5వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత జ‌ట్టు మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ ర్యాంక్ సాధించాడు. ఇంగ్లండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ టాప్‌లో నిలిచాడు. 

టీ20ల్లో టాప్-5 బ్యాటర్లు..
1. ట్రావిస్ హెడ్- 855 (రేటింగ్ పాయింట్స్‌)
2. తిలక్ వర్మ- 832 (రేటింగ్ పాయింట్స్‌)
3. ఫిల్ సాల్ట్- 782 (రేటింగ్ పాయింట్స్‌)
4. సూర్యకుమార్ యాదవ్- 763 (రేటింగ్ పాయింట్స్‌)
5. జోస్ బట్లర్- 749 (రేటింగ్ పాయింట్స్‌)

టీ20ల్లో టాప్-5 బౌలర్లు
1. ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)- 718 (రేటింగ్ పాయింట్స్‌)
2. ఆకీల్ హొసెన్ (వెస్టిండీస్)- 707 (రేటింగ్ పాయింట్స్‌)
3. వానిందు హసరంగ (శ్రీలంక) - 698 (రేటింగ్ పాయింట్స్‌)
4. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 694 (రేటింగ్ పాయింట్స్‌)
5. వరుణ్ చక్రవర్తి (భారత్) - 679 (రేటింగ్ పాయింట్స్‌)

  • Loading...

More Telugu News