Thummala: వారి కన్నీరు తుడవాలనే రైతు రుణమాఫీ చేశాం: తుమ్మల నాగేశ్వర రావు
![Tummala Nageswara Rao ows Loan waiver](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0e2eef51d.jpg)
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల ఇబ్బందులు చూశామన్న మంత్రి
- భూమికి, విత్తనానికి ఉన్న సంబంధమే రైతులకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నదన్న మంత్రి
- రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే ప్రభుత్వమన్న మంత్రి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు పడిన ఇబ్బందులను చూశామని, అందుకే వారి కన్నీరు తుడవాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. భూమికి, విత్తనానికి ఎలాంటి సంబంధం ఉందో, రైతులకు కాంగ్రెస్ పార్టీతో అదే విధమైన సంబంధం ఉందన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రకటించిన రూ.1 లక్ష రుణమాఫీని కూడా ఒకేసారి చేయలేదన్నారు. దీంతో రైతులపై రూ.11,145 కోట్ల మేర భారం పడిందని విమర్శించారు. గతంలో కోతల సమయానికి కూడా రైతుబంధు అందేది కాదని, కానీ తమది రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే ప్రభుత్వమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 35 శాతం నిధులు కేటాయించినట్లు చెప్పారు.
వరికి బోనస్ ఇస్తామని చెప్పి దానిని విజయవంతంగా అమలు చేశామన్నారు. సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం హయాంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతును రాజు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.