Dharmavarapu: సినిమాల్లోకి వస్తున్నా: ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు!
![Ravi Brahma Teja Interview](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0594aa827.jpg)
- 'ఆనందో బ్రహ్మ'తో పాప్యులర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆయనను ప్రోత్సహించిన జంధ్యాల
- స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన నటుడు
- అదే బాటలో నడవనున్న ఆయన తనయుడు
నిన్నటితరం హాస్యనటులలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. డైలాగ్ డెలివరీలో తనదైన ప్రత్యేకతను చాటుతూ వచ్చిన ఆయన, 2013లో చనిపోయారు. ఆయన భార్య కృష్ణజ-తనయుడు రవి బ్రహ్మతేజ తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కృష్ణజ మాట్లాడుతూ... "ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెంలో జన్మించారు. మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది" అని అన్నారు.
"ఒక వైపున జాబ్ చేస్తూనే మరో వైపున నాటకాలు వేసేవారు. దూరదర్శన్ కోసం చేసిన 'ఆనందో బ్రహ్మ' సీరియల్ తో ఆయన బాగా పాప్యులర్ అయ్యారు. అప్పుడు ఆయనను చూసిన జంధ్యాల గారు 'జయమ్ము నిశ్చయంబురా' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 'నువ్వు నేను' సినిమా నుంచి ఆయన మరింత బిజీ అయ్యారు. ఆయనకి మంచి సమయస్ఫూర్తి ఉండేది. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ మాట్లాడుతుండేవారు" అని చెప్పారు.
రవి బ్రహ్మతేజ మాట్లాడుతూ... "నాన్నగారికి ఎస్వీఆర్ అంటే చాలా ఇష్టం. నాన్నగారికి తెలుగు భాష అంటే ప్రాణం. అందువలన ఆయన డైలాగ్ డెలివరీ చాలా స్పష్టంగా ఉండేది. నాన్నగారు లేకపోయినా ఇండస్ట్రీలోని వాళ్లంతా బాగానే పలకరిస్తున్నారు. ప్రస్తుతం నేను నటనలో శిక్షణ తీసుకుంటున్నాను. త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఆలోచన ఉంది. తప్పకుండా రాణిస్తాననే నమ్మకం ఉంది" అని చెప్పారు.