Steve Smith: స్టీవ్ స్మిత్ అరుదైన మైలురాయి... సచిన్ తో కూడిన ఎలైట్ జాబితాలోకి ఆసీస్ క్రికెటర్!
![Steve Smith Joins Elite List Featuring India Legendary Sachin Tendulkar](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a0016bc777.jpg)
- టెస్టుల్లో 10వేల పరుగులు మార్క్‌ను అందుకున్న స్మిత్
- శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఈ ఘనత
- స్మిత్ కంటే ముందు ఈ ఫీట్ నమోదు చేసిన ముగ్గురు ఆసీస్ ప్లేయర్లు
- ఓవరాల్‌గా ఈ మైలురాయి సాధించిన 15వ ఆటగాడు స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇవాళ్టి నుంచి గాలే స్టేడియంలో శ్రీలంకతో మొదలైన మొదటి టెస్టులో మొదటి రోజు తాను ఎదుర్కొన్న తొలి బంతికే రన్ చేసిన స్మిత్ 10 వేల పరుగుల మైలురాయిని నమోదు చేశాడు.
దీంతో ఈ ఫీట్ అందుకున్న ప్రపంచ దిగ్గజ బ్యాటర్ల సరసన చేరాడు. కాగా, స్మిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లోనే ఈ మైలురాయిని చేరతాడనుకున్నా 9,999 పరుగుల వద్ద ఆగిపోయాడు. ఇక స్మిత్ కంటే ముందు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
రికీ పాంటింగ్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్ అతని కంటే ముందు ఈ ఫీట్ నమోదు చేశారు. దాంతో ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా స్మిత్ అవతరించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన 15వ ఆటగాడు స్మిత్. స్మిత్ 115 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
అతని కంటే ముందు ఒక్క బ్రియన్ లారా మాత్రమే ఫాస్టెస్ట్‌గా (111 టెస్టుల్లో) ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర ఇద్దరూ కూడా 10 వేల పరుగుల మార్క్‌ను అందుకునేందుకు 195 టెస్టులు ఆడారు. రికీ పాంటింగ్ 196 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
టెస్టుల్లో 10వేల కంటే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్లు వీరే..
సచిన్ టెండూల్కర్- 15,921
రికీ పాంటింగ్- 13,378
జాక్ కలిస్-13,289
రాహుల్ ద్రవిడ్- 13,288
జో రూట్- 12,972
అలిస్టర్ కుక్-12,472
కుమార సంగక్కర- 12,400
బ్రియాన్ లారా- 11,953
శివనారాయణ్ చందర్‌పాల్- 11,867
మహేల జయవర్ధనే- 11,814
అలెన్ బోర్డర్-11,174
స్టీవ్ వా- 10,927
సునీల్ గవాస్కర్- 10,122
యూనిస్ ఖాన్- 10,099
స్టీవ్ స్మిత్- 10,009*