Anagani Satya Prasad: సింహాచలం పంచగ్రామాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది: అనగాని సత్యప్రసాద్

- అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్న సత్యప్రసాద్
- 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడి
- ఇనాం భూమిని క్రమబద్ధీకరిస్తామన్న మంత్రి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత, భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. ముందు నుంచి ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తున్నామని... సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారు.
సింహాచలం భూములను ఆక్రమించి 12,149 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకున్నాయని చెప్పారు. ఆ 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఆ భూమికి సమానమైన రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 610 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి ఇస్తామని చెప్పారు. చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట దేవస్థానానికి భూమి ఇస్తామని తెలిపారు. గాజువాక, పెదగంట్యాడలో ఇనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.