Revanth Reddy: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి, హరీశ్ రావు

- భక్తుల మృతి విచారకరమన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్న సీఎం
- తొక్కిసలాట ఘటన కలిచివేసిందన్న హరీశ్ రావు
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పందించారు. తొక్కిసలాట ఘటనలో పదిహేను మంది మృత్యువాత పడ్డారని, మరికొంతమంది గాయపడ్డారని తెలిసిందని, ఇది విచారకర విషయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వివరించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన కారణంగా మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.
తొక్కిసలాట ఘటన కలచివేసింది: హరీశ్ రావు
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని కేంద్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.