Pawan Kalyan: పెద్దిరెడ్డి కుటుంబం అటవీభూముల ఆక్రమణ... సమగ్ర నివేదిక కోరిన పవన్ కల్యాణ్

Pawan Kalyan orders on Peddireddy family alleged land grabbing

  • మంగళంపేట అటవీప్రాంతంలో భారీ ఎస్టేట్
  • ఎస్టేట్ కు వెళ్లేందుకు అడవిలో రోడ్డు
  • పెద్దిరెడ్డి కుటుంబంపై భూ అవకతవకల ఆరోపణలు
  • తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీ సర్కారు
  • అటవీశాఖ మంత్రిగా రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భారీ ఆక్రమణలకు పాల్పడినట్టు, ఒక ఎస్టేట్... అందులో లగ్జరీ గెస్ట్ హౌస్ నిర్మించుకుని... ఎస్టేట్ కు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రోడ్డు వేసుకున్నారని సమాచారం వెలువడడం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. 

అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముందు, వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక అందించాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు. అటవీభూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్దేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు? అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారు? అనే అంశాలపై విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరు? తద్వారా లబ్ధి పొందింది ఎవరు? అనే అంశాలను నివేదికలో పొందుపరచాలని తెలిపారు.

More Telugu News