Chandrababu: పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు.. పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు

TDP Chief Chandrababu Teleconference with party leaders

  • వచ్చే జూన్ లోగా మొత్తం 1,314 పోస్టుల భర్తీ
  • ప్రతిపాదనలు పంపాలంటూ ఎమ్మెల్యేలకు సూచన
  • మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత.. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ చీఫ్

ఐదేళ్లపాటు కార్యకర్తలు చేసిన తిరుగులేని పోరాటమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కారణమని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 214 మార్కెట్‌ కమిటీలు, 1,100 దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో నియామకాలతో పాటు అన్ని నామినేటెడ్ పోస్టులను వచ్చే జూన్ లోగా భర్తీ చేస్తామని చెప్పారు. 

ఈ పదవులు పొందిన వారి పనితీరును సమీక్షించి, భవిష్యత్తు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆయా పోస్టులకు అర్హులైన వారి పేర్లతో జాబితా పంపించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మంగళవారం పార్టీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈమేరకు సూచనలు చేశారు. నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లలో సభ్యులై ఉండాలని చెప్పారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. 
 
కార్యకర్తలను మరవొద్దు..
 ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారణం కార్యకర్తలేనని, అలాంటి కార్యకర్తలను మరవొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు. కార్యకర్తలను ఎల్లప్పుడూ గౌరవించాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎన్నికల హామీలు అన్నింటినీ అమలుచేస్తామని చెబుతూ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News