Mahakumbh Mela Stampede: ప్రయాగ్‌రాజ్‌లో 8 కోట్ల మంది యాత్రికులున్నారు.. తొక్కిస‌లాట‌పై మోదీ నాలుగు సార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి

PM Modi Spoke To Me At Least 4 Times Yogi Adityanath On Mahakumbh Mela Stampede

  • మహాకుంభ మేళా తొక్కిస‌లాట‌పై పుకార్ల‌ను న‌మ్మొద్ద‌న్న యూపీ సీఎం
  • భ‌క్తులు, సాధువులు అధికారుల‌ సూచనలను పాటించాలని విజ్ఞప్తి 
  • ఈ ఘ‌ట‌న‌పై మోదీ, అమిత్ షా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అప్‌డేట్‌లు తీసుకుంటున్నారన్న యోగి

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ మేళాలో ఈరోజు తెల్ల‌వారుజామున‌ తొక్కిసలాట చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడారు. దీనిపై వ‌చ్చే పుకార్లను భ‌క్తులు, సాధువులు పట్టించుకోవద్దని, అధికారుల‌ సూచనలను పాటించాలని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. 

ఈరోజు తెల్లవారుజామున కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని, వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ముఖ్య‌మంత్రి చెప్పారు. అలాగే ఈ ఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అప్‌డేట్‌లు తీసుకుంటున్నారని, వారు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

"ఈరోజు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 8 కోట్ల మంది యాత్రికులు ఉన్నారు. నిన్న సుమారు 5.5 కోట్ల మంది యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం వైపు పెద్ద జనసందోహం ఉంది. తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య బారికేడ్లు విరిగిపోవ‌డంతో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు" అని సీఎం చెప్పారు.

"ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం నుంచి నాకు నాలుగు సార్లు కాల్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ భారీగా జనం పోటెత్తారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు స్థానిక యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అందుకు భ‌క్తులు సహకరించాలి" అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 

ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో భక్తులు, సాధువులు పుకార్లను పట్టించుకోవద్దని, ఓపికగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. యాత్రికుల‌కు సహాయం చేయడానికి పరిపాలన విభాగం సిద్ధంగా ఉంద‌న్నారు. యాత్రికులు త్రివేణి సంగ‌మం వ‌ద్దే కాకుండా అందుబాటులో ఉన్న ఇత‌ర ఘాట్‌ల వ‌ద్ద కూడా పవిత్ర స్నానాలు చేసుకోవాల‌ని సూచించారు.  

More Telugu News