Janasena leader: పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత జులుం

Janasena leader Serious on village secretary

  • గ్రామ పంచాయతీ కార్యదర్శిని దూషించిన జనసేన నేత 
  • విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఘటన
  • విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత

గ్రామ పంచాయతీ కార్యదర్శిపై బహిరంగంగా జనసేన నేత తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

ఎనికేపాడులో జాతీయ రహదారి పక్కన జనసేన నాయకుడు టంకశాల సుబ్బారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా, మహాత్మా గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే రూరల్ మండల జనసేన అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో కొంతమంది జనసేన నాయకులు ఈ విగ్రహాలతో పాటు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరిద్దామన్న అభిప్రాయంలో ఉన్నారు.  ఈ విషయంపై జనసేనలోని రెండు వర్గాల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలోనే స్థానిక జనసేన నాయకులకు ఆహ్వానం లేకుండా గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్‌ను పిలిచి టంకశాల సుబ్బారావు విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ క్రమంలో స్థానిక జనసేన నాయకులు పలువురు అక్కడకు చేరుకుని తమను సంప్రదించకుండా ఏకపక్షంగా కార్యక్రమం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ పరిణామం నేపథ్యంలో అక్కడకు గ్రామ కార్యదర్శి మండవ విద్యాధర్ చేరుకుని అనుమతులు లేకుండా విగ్రహాలు ఎలా ఆవిష్కరిస్తారని అడిగారు. దీంతో చలమలశెట్టి రమేష్ తీవ్ర ఆగ్రహంతో గ్రామ కార్యదర్శి విద్యాధర్‌ను పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. 'ఒరేయ్ ఈవో.. తోలు తీస్తా.. జాబ్ తీయిస్తా.. నువ్వు ఎంత? నీ బతుకు ఎంత ? నువ్వు మాకు పాలేరువి' అంటూ దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పటమట పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సమసిపోయింది.   

  • Loading...

More Telugu News