Gummanuru Jayaram: రైలు పట్టాలపై పడుకోబెడతా: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్
![TDP MLA Gummanuru Jayaram warning](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn6799b3d4807d5.jpg)
- తనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారన్న జయరాం
- నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలన్న ఎమ్మెల్యే
- ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపాటు
తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని... నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని... వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.
గుంతకల్లు పట్టణ శివారులోని దోనిముక్కలలో జయరాం పర్యటించారు. అక్కడ ఉన్న లేఔట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వారిపై ఆయన నిప్పులు చెరిగారు. డబ్బులకు ఆశపడి తప్పుడు వార్తలు రాయొద్దని హెచ్చరించారు.