Suryakumar Yadav: అతడే మా ఓటమికి కారణం.. అందుకే ప్రపంచ స్థాయి బౌలర్ అయ్యాడు: సూర్యకుమార్
![Suryakumar Yadav Credits World Class Bowler Adil Rashid For England Win In 3rd T20I](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn6799b2ad5c3f6.jpg)
- రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్, భారత్ మధ్య మూడో టీ20
- 26 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా
- భారత జట్టు ఓటమికి ఆదిల్ రషీద్ స్పెల్ కారణమన్న సూర్యకుమార్
- 4 ఓవర్ల కోటాలో కేవలం 15 రన్సే ఇచ్చి కీలకమైన తిలక్ వర్మ వికెట్ తీసిన రషీద్
- తిలక్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి, మ్యాచ్‌ను తమవైపునకు తిప్పేసిన బౌలర్
రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 26 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన కేవలం 145 రన్స్‌కే పరిమితమైంది. దీంతో 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
దాంతో హ్యాట్రిక్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించిన టీమిండియాకు ఈ ఓటమితో ఊహించని షాక్ తగిలినట్లయింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ జట్టు ఓటమిపై మాట్లాడాడు. భారత జట్టు ఓటమికి ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ స్పెల్ కారణమని సూర్య అన్నాడు. ఇక ఆదిల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి కీలకమైన తిలక్ వర్మ వికెట్ తీశాడు. ఓ అద్భుతమైన బంతితో తిలక్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి, మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశాడు.
"రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు కొంచెం ఎక్కువగా ఉంటుందని భావించా. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ మా చేతుల్లోనే ఉందనుకున్నా. అయితే, దూకుడుగా ఆడిన తిలక్ వర్మను ఔట్ చేసి ఆదిల్ రషీద్ మ్యాచ్‌ను తిప్పేశాడు. అతను నిజంగా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను ప్రపంచ స్థాయి బౌలర్ అయ్యాడు. అతను కనీసం మమ్మల్ని స్ట్రైక్ కూడా రొటేట్ చేయనీయలేదు. ఇంగ్లండ్ విజయం క్రెడిట్ మొత్తం రషీద్‌కే దక్కాలి.
ఇక టీ20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రత్యర్థి జట్టు 127/8 వద్ద ఉన్నప్పుడు 170 పరుగులు చేస్తుందని ఊహించలేదు. మా బ్యాటింగ్ సమయంలో పిచ్ స్పిన్నర్లకు అధికంగా అనుకూలించడంతో ఆ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదనిపించింది. మాకు బౌలింగ్ పరంగా ఎలాంటి సమస్య లేదు. కానీ, బ్యాటింగ్ విషయంలో ఈ పరాజయం నుంచి మరికొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం" అని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చెప్పాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. "మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎంతో నైపుణ్యంతో మంచి ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆదిల్ రషీద్ మా జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు. అతను మా టీమ్‌లో ఉండటం మా అదృష్టం. రషీద్ బౌలింగ్‌లో అన్ని వైవిధ్యాలు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలర్. ఎక్కువగా రన్స్ ఇవ్వడానికి అసలు ఇష్టపడడు.
నిలకడగా బౌలింగ్ వేయడం అతని ప్రత్యేకత. డకెట్ ఈ మ్యాచ్‌లో నాణ్యమైన ఆటతో ఆకట్టుకున్నాడు. రషీద్, మార్క్‌వుడ్ ఆఖర్లో విలువైన పరుగులు జోడించడం జట్టుకు కలిసొచ్చింది. ఇంగ్లండ్ విజయానికి ఇది కూడా ఒక కారణం. టీమిండియాకు, మా ఇన్నింగ్స్‌కు అదే తేడా" అని బట్లర్ తెలిపాడు.