Prakash Raj: అది ఫేక్ ఫొటో: ప్రకాశ్ రాజ్
![prakash raj on viral photo related to kumbh mela](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679990b1d63e0.jpg)
- కుంభ మేళాలో ప్రకాశ్ రాజ్ పుణ్య స్నానం చేస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్
- ప్రకాశ్ రాజ్ పై నెటిజన్ల విమర్శల వర్షం
- ఫోటో క్రియేట్ చేసిన వాళ్లు పరిణామాలు ఎదుర్కొంటారన్న ప్రకాశ్ రాజ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు, నకిలీ ఫోటోలు దర్శనమిస్తున్న విషయం విదితమే. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వాటిలో ఏది నిజమైనదో, ఏది నకిలీనో తెలుసుకోవడం కష్టతరమవుతోంది. వాటిని సరిగ్గా పరిశీలించకుంటే, నకిలీ ఫోటోలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది.
తాజాగా, సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఎవరో ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఇది నిజమైన ఫోటోగా భావించిన కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేశారు.
నాస్తికుడినని చెప్పుకునే ప్రకాశ్ రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం ఏమిటని కొందరు వ్యాఖ్యానించారు. ఈ ఫోటో ప్రకాశ్ రాజ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. అది నకిలీ వార్త అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.