Chandrababu: '1ఎం1బీ' సంస్థ సేవలు ప్రశంసనీయం: ఏపీ సీఎం చంద్రబాబు
![chandrababu appreciated the services of 1m1b organization](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn67998783e8cd9.jpg)
- కుప్పంలో గ్రీన్ స్కిల్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ ఏర్పాటు చేసిన 1ఎం 1బీ సంస్థ
- ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
- వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ ద్వారా 50 వేల మందికి శిక్షణ అందిస్తారన్న సీఎం
ప్రతిభావంతులైన యువత కోసం ప్రత్యేక చొరవతో రాయలసీమలో అమెరికాకు చెందిన 1M1B (వన్ మిలియన్ వన్ బిలియన్) సంస్థ సేవలందిస్తుండటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సంస్థ కుప్పంలో గ్రీన్ స్కిల్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమలోని ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమిదని ఆయన తెలిపారు. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ ద్వారా 50 వేల మందికి శిక్షణ అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో వంద మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడంతోపాటు 30 వేల మంది యువతకు ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కుప్పం సెంటర్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు జత చేశారు.