Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి

Stampede in Maha Kumbh Mela 15 dead

  • నేడు మౌని అమావాస్య
  • సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
  • బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట
  • సీఎం యోగికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు మౌని అమావాస్యను పురస్కరించుకుని సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోవడంతో తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

మృతదేహాలను, క్షతగాత్రులను స్వరూప్‌రాణి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 70 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, నిన్న సంగమంలో 5.5 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు.

కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘటనపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫో‌న్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తొక్కిసలాట నేపథ్యంలో 13 అఖాడాలు మౌని అమావాస్య అమృత స్నానాలను రద్దు చేశాయి. సంగమం వద్ద జన సమూహం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖాడ పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి తెలిపారు.

More Telugu News