Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు!
![Phone tapping case High Court judge phones tapped](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn6799814c0f75f.jpg)
- గత ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్
- త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌పై నిఘా
- ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆధారాలు
- కీలక నిందితుడి ఫోన్ విశ్లేషణతో వెలుగులోకి మరిన్ని విషయాలు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుల ఫోన్లలో ఇద్దరు న్యాయమూర్తుల ఫొటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్)తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్)ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా, వాయిస్ కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి నిఘా పెట్టినట్లు కూడా తేలింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. పలువురు ప్రతిపక్ష నేతలు, హైకోర్టు న్యాయమూర్తితో పాటు ఆయన భార్య ప్రొఫైల్‌ను కూడా నిందితులు రూపొందించి వారి సెల్‌ఫోన్లపై నిఘా ఉంచిన విషయం బయటపడింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇప్పుడు మరో ఇద్దరు న్యాయమూర్తులపై నిఘా పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది.