Sridhar Babu: హైదరాబాద్‌లో మరో రెండు ఐటీ పార్కులు... ఎక్కడ ఏర్పాటు చేయాలో అధ్యయనం చేస్తున్నాం: శ్రీధర్ బాబు

Sridhar Babu says will start two it parks in Hyderabad
  • హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన 'డ్యూ'
  • సచివాలయంలో కంపెనీ ప్రతినిధులతో శ్రీధర్ బాబు సమావేశం
  • ఐటీ పార్కుల్లో పని చేసే వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తరహాలో మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో 'డ్యూ' సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఐటీ రంగంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు.

హైటెక్ సిటీ తరహాలో ఏర్పాటు చేయనున్న రెండు ఐటీ పార్కులను ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి? నగర శివార్లలో ఏయే ప్రాంతాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ పార్కుల్లో పనిచేసే వారికి అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూస్తామన్నారు. ఈ ఐటీ పార్కులకు ఎక్కడి నుంచైనా చేరుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

ఐటీ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. భూకేటాయింపులకు సంబంధించి ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని, దీంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తాము ప్రత్యేక పాలసీని తీసుకురావాలని నిర్ణయించామన్నారు. పెట్టుబడితో పాటు ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని స్పష్టం చేశారు.
Sridhar Babu
Telangana
Hyderabad
Congress

More Telugu News