Health: నెయ్యి రాస్తే కేశాలు బాగా పెరుగుతాయా? ప్రయోజనమెంత?

- నెయ్యితో మర్దన వల్ల కేశాలు బాగా పెరుగుతాయనే నమ్మకం
- అద్భుతమైన పోషకాలతో కూడిన ఆహారంగా నెయ్యికి ఎంతో ప్రాముఖ్యత
- కేశాల సంరక్షణలోనూ కొన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు
తలకు నెయ్యి రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. ఆయుర్వేదం కూడా నెయ్యి వినియోగం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం? నెయ్యితో మర్దన చేయడం వల్ల కేశాలు దట్టంగా, నల్లగా పెరుగుతాయా? ఎంత వరకు ప్రయోజనం ఉంటుందన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే...
పోషకాలకు నిలయం నెయ్యి...
ఎన్నో రకాల పోషకాలకు నెయ్యి నిలయం. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. నెయ్యిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు నెయ్యిలో ఒమేగా–3, ఒమేగా–9 ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
కేశాల పెరుగుదలకు తోడ్పాటు ఎలా?
- నెయ్యితో తలపై మర్దన చేసినప్పుడు అందులోని ఒమేగా–3, ఒమేగా–9 ఫ్యాటీ యాసిడ్లు వెంట్రుకల కుదుళ్లకు మంచి పోషకాలను అందిస్తాయి. కేశాలు బాగా పెరిగేందుకు వీలైన పరిస్థితిని కల్పిస్తాయి.
- నెయ్యిలో అత్యధికంగా ఉండే విటమిన్-ఏ వల్ల వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి. కుదుళ్లు పొడిబారిపోకుండా, దెబ్బతిన్న కణాలు పునరుద్ధరణ చెందేందుకు విటమిన్-ఏ తోడ్పడుతుంది.
- ఇక నెయ్యిలో విటమిన్-ఈ కూడా అధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా తోడ్పడుతుంది.
- నెయ్యిలో ఉండే బ్యూటరేట్ ఫ్యాటీ యాసిడ్ కు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది.
ఎంత వరకు ప్రయోజనం?
కేవలం నెయ్యితో మర్దన చేసినంత మాత్రాన రాత్రికి రాత్రే కేశాల పెరుగుదల మొదలవుతుందని భావించవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెంట్రుకలు, కుదుళ్లు పొడిబారకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యిలోని పోషకాలు తోడ్పడుతాయని వివరిస్తున్నారు. వెంట్రుకలు తెగిపోకుండా, బలంగా అవుతాయని చెబుతున్నారు.
అయితే వెంట్రుకలు రాలిపోవడానికి ఇతర కారణాలైన తీవ్ర ఒత్తిడి, అపరిశుభ్రత, ఇతర అనారోగ్యాలు, హార్మోన్ల అసమతుల్యత నుంచి బయటపడటంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. నెయ్యిని కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్న సమయంలో కుదుళ్లకు పట్టేలా మర్దన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.