KTR: కేసీఆర్ ఆ విషయం ఎప్పుడో చెప్పారు: నల్గొండ రైతు మహాధర్నాలో కేటీఆర్

KTR participates in Rythu Mahadharna

  • కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం చెబుతారని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్
  • కేసీఆర్ ప్రభుత్వం రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిందన్న కేటీఆర్
  • మోసం చేయడాన్ని కూడా చారిత్రాత్మకం అంటారేమోనని చురక

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకానికి రాంరాం చెబుతారని కేసీఆర్ ముందే చెప్పారని, ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రైతుబంధు నిధులు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ క్రాస్ రోడ్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాడు నిజాం సర్కార్‌ను నిలదీసిన గడ్డ నల్గొండ అని అన్నారు.

నల్గొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఒక మంత్రి ప్రశ్నించారని, వరి ఉత్పత్తిలో ఈ జిల్లాను కేసీఆర్ నెంబర్ వన్‌గా చేశారని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రూ.73 వేల కోట్లు ఇచ్చిందన్నారు. నల్గొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. రైతుబంధు నిధులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు.

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హామీలపై గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తుంటే పాలకుల వద్ద సమాధానం లేదని కేటీఆర్ విమర్శించారు. రూ.49 వేల కోట్లలో పావు వంతు రుణమాఫీ కూడా కాలేదన్నారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆఖరుకు రూ.12 వేలు ఇవ్వాలని నిర్మయించారని మండిపడ్డారు.

ఇలా మోసం చేయడాన్ని కూడా చారిత్రాత్మకమే అంటారేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుకు... రైతు భరోసాకు... కులగణనకు... ఇలా అన్నింటికి దరఖాస్తులు అని చెబుతున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే అది జిరాక్స్ సెంటర్ల వాళ్లు మాత్రమేనని వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News