AB Venkateswara Rao: మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట... సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం

- గత ప్రభుత్వ హయాంలో ఏబీవీపై అవినీతి ఆరోపణలు
- రెండు సార్లు సస్పెండ్ చేసిన వైసీపీ ప్రభుత్వం
- ఏబీవీపై అభియోగాలను తొలగించిన చంద్రబాబు సర్కారు
- సస్పెన్షన్ కాలానికి ఆయనకు వేతనం, అలవెన్సులు చెల్లించాలని తాజా ఆదేశాలు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయన ఉద్యోగ సర్వీసు కాలంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కాలాన్ని చంద్రబాబు సర్కారు క్రమబద్ధీకరించింది.
గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు రెండు పర్యాయాలు సస్పెన్షన్ విధించడం తెలిసిందే. తొలిసారిగా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు సస్పెండ్ చేశారు. రెండోసారి 2022 జూన్ నుంచి 2024 మే వరకు సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే, ఈ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వర్తించినట్టుగా మార్చుతూ చంద్రబాబు సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సస్పెన్షన్ కాలానికి వేతనం, అలవెన్సుల చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం ఎంతో లెక్కించి... ఆ సమయంలో ఆయన విధులు నిర్వర్తించినట్టుగానే భావించి, ఎంత మొత్తం ఇవ్వాలో అంత మొత్తం ఏబీ వెంకటేశ్వరరావుకు చెల్లించాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
కాగా, ఏబీ వెంకటేశ్వరావుపై గతంలో నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.