Andhra Pradesh: గద్దర్‌కు ఏ హోదాలో అవార్డ్ ఇవ్వాలి? రేపు ఉగ్రవాదులకూ ఇవ్వమంటారా?: రేవంత్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత ఆగ్రహం

AP BJP leader Vishnu fires at CM Revanth Reddy

  • గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం
  • రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తికి అవార్డు ఇస్తారా? అని నిలదీత
  • గద్దర్ కూతురు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉంది కాబట్టి అవార్డ్ ఇవ్వాలా? అని ప్రశ్న
  • అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్య

గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వాలన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గద్దర్‌కు ఏ హోదాలో పద్మ అవార్డ్ ఇవ్వాలి? కాంగ్రెస్ వాళ్లు రేపు ఉగ్రవాదులకు కూడా అవార్డు ఇవ్వమంటారేమో? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఈరోజు ఆయన మాట్లాడుతూ... బీజేపీ కార్యకర్తలు నిత్యం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తారని, కానీ గద్దర్ మాత్రం నక్సలైట్లతో కలిసి ఎంతోమందిని హత్య చేయించారని ఆరోపించారు. గద్దర్‌ను ఎల్‌టీటీఈ ప్రభాకరన్, నయీంతో పోల్చారు. ఎంతోమంది పోలీసులను చంపిన కేసులో... కోర్టులకు కూడా తిరగలేనని గద్దర్ రాష్ట్రపతికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.

గద్దర్ కూతురు వెన్నెల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలా? అని రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి కూడా పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అని ప్రశ్నించారు. గద్దర్‌కు ఎల్‌టీటీఈ తీవ్రవాదులకు తేడా ఏమిటో చెప్పాలన్నారు. మాజీ మావోయిస్ట్, రాజ్యాంగ వ్యతిరేకి అయిన గద్దర్‌కు ఏ హోదాలో అవార్డు ఇవ్వాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ గురించి తెలియని వాళ్లే రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నట్లుగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News