AP CM: ఏపీ సీఎం చంద్రబాబుపై కేసుల బదిలీ పిటిషన్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం

- ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని న్యాయవాదికి హెచ్చరిక
- మీలాంటి సీనియర్ లాయర్ ఇలాంటి తప్పుడు పిటిషన్లపై ఎలా వాదిస్తారన్న ధర్మాసనం
- సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క మాట మాట్లాడినా సరే భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ తరపు లాయర్ ను హెచ్చరించింది. ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్ అని తోసిపుచ్చింది.
చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా.. జస్టిస్ బేలా త్రివేది తీవ్రంగా స్పందించారు. ఇలాంటి తప్పుడు పిటిషన్లపై మీలాంటి సీనియర్ న్యాయవాది ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. ఒక్క మాట కూడా మాట్లాడొద్దని, లేదంటే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.