Arvind Kejriwal: బీజేపీకి అర్థం కాని కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు.. మోదీకి సవాలుగా ఢిల్లీ ఎన్నికలు

BJPs Struggle To Decode Kejriwals Election Tactics

  • మోదీకి తలనొప్పిగా మారిన అరవింద్ కేజ్రీవాల్
  • ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని గెలుచుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు
  • ‘కోడ్ కేజ్రీవాల్’ను డీకోడ్ చేయలేక బీజేపీ తిప్పలు
  • కేజ్రీవాల్‌ వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కాషాయ పార్టీ

తమకు అందని ద్రాక్షలా మారిన ఢిల్లీ పీఠాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 2014 నుంచి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలను డీకోడ్ చేయలేక బీజేపీ సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఇది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

మోదీ ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి పరాజయం తప్పడం లేదు. గత రెండుసార్లు బీజేపీ చాలా దారుణ పరాజయాలు ఎదుర్కొంది. ఇది మోదీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. గతంలో పలుమార్లు ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ విజయం సాధించిన మోదీ.. విచిత్రంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తూనే ఉన్నారు. ‘కోడ్ కేజ్రీవాల్’ ఇప్పటికీ బీజేపీకి మిస్టరీగా మారింది. దీంతో కేజ్రీవాల్ వ్యూహాలను ఛేదించేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్తూ బీజేపీని ఎక్కడికక్కడ ట్రాప్ చేస్తున్నారు. బీజేపీ అనూహ్యంగా అందులో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

కేజ్రీవాల్‌కు ఈ ఎన్నికలు కత్తి మీద సాములాంటివనే చెప్పాలి. అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లడం వంటివి ఆయనను కొంత దుర్బలంగా మార్చాయి. అయితే, ఈ ఎన్నికలు తన దశాబ్దకాల కెరీర్‌లో అత్యంత క్లిష్టమైనవని ఆయనకు తెలుసు. దీనికి తోడు 11 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఆయన ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి ఉంది. దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మారుస్తానని ఒకప్పుడు హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఆయనను మానసికంగా కొంత బలహీనంగా మార్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీ ఓడిపోతే కనుక బీజేపీని తప్ప మరెవరినీ నిందించలేమని నిపుణులు చెబుతున్నారు.

2013లో మోదీ దేశంలో హీరోగా మారినప్పుడు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లతో ఆయన ప్రజాదరణ అమాంతం పెరిగినప్పుడు కూడా కేజ్రీవాల్‌ను ఏమీ చేయలేకపోయారు. కేజ్రీవాల్ అబద్ధాలకోరు అని, సొంత గురువు అన్నా హజారేను మోసం చేశారని, ఒకప్పటి తన సహచరులను వదిలేశారని, ఆయన నకిలీ హిందువు అని, అవకాశవాది అని, అర్బన్ నక్సల్ అని.. ఇలా బీజేపీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోకుండా ఆయనకే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధికారాన్ని నిలుపుకోవాలని కేజ్రీవాల్, ఈసారి ఎలాగైనా ఆయనను పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి గెలిచేది ఎవరో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Arvind Kejriwal
Narendra Modi
BJP
AAP
  • Loading...

More Telugu News