Kailash Mansarovar Yatra: కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకారం

India and China Decide To Resume Direct Flights and Kailash Mansarovar Yatra

  • కొవిడ్-19 నేపథ్యంలో 2020లో నిలిచిపోయిన యాత్ర
  • కరోనా తగ్గినా పునరుద్ధరణకు చైనా వైపు నుంచి జరగని ప్రయత్నాలు
  • తాజాగా విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు
  • కైలాస సరోవర యాత్రతోపాటు విమాన సర్వీసుల పునరుద్ధరణకు అంగీకారం

2020లో కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఇరు దేశాల మధ్య రెండ్రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బీజింగ్‌లో పర్యటించారు.  

భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తాజాగా ఇరు పక్షాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమీక్షించాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించేందుకు, పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.  

టిబెట్‌లోని కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సును సందర్శించే కైలాస, మానస సరోవర యాత్ర 2020లో నిలిచిపోయింది. కరోనా తగ్గినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిని పునరుద్ధరించేందుకు చైనా వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. తాజాగా, ఇప్పుడు ఈ యాత్రను పునరుద్ధరించడంతోపాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడంతో, అందుకు అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు సంబంధిత అధికారులు త్వరలోనే సమావేశమవుతారు.  

  • Loading...

More Telugu News