Narendra Modi: డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్రమోదీ!

PM Modi speaks to US President Donald Trump over phone
  • ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక తొలిసారి ఫోన్ కాల్
  • ప్రియమిత్రుడితో మాట్లాడటం ఆనందంగా ఉందన్న మోదీ
  • పరస్పర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామన్న మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇద్దరు దేశాధినేతల మధ్య ఇది తొలి ఫోన్ సంభాషణ. డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ట్రంప్-మోదీ ఫోన్ ద్వారా మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్‌కు మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వీరు తొలిసారి మాట్లాడుకున్నారు. 

ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రధాని మోదీ ట్వీట్

తన ప్రియమిత్రుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం ఆనందంగా ఉందంటూ మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. పరస్పర ప్రయోజనాలు, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం కలిసి పని చేస్తామన్నారు.
Narendra Modi
Donald Trump
USA

More Telugu News