Man Eater Tiger: వయనాడ్ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం... పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు

- వయనాడ్ జిల్లాలో హడలెత్తించిన పెద్ద పులి
- మ్యాన్ ఈటర్ గా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
- చంపేసేందుకు ఆదేశాలు
- అనూహ్య రీతిలో ఓ ఇంటి వెనుక చనిపోయి కనిపించిన పులి
- మరో క్రూరమృగం దాడిలో మరణించి ఉంటుందన్న అధికారులు
కేరళలోని వయనాడ్ జిల్లాలో అందరినీ హడలెత్తించిన మ్యాన్ ఈటర్ పెద్ద పులి ఎట్టకేలకు మరణించింది. ఇటీవల మనంతవాడి ప్రాంతంలో ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే కార్మికురాలిపై పులి దాడి చేసి, సగం తినేసింది. ఓ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారిపైనా ఆ పులి పంజా విసిరింది.
పులి కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో, ప్రభుత్వం ఈ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించి, చంపేసేందుకు ఆదేశాలిచ్చింది.
అయితే, ఎవరూ ఊహించని రీతిలో పిలకావు ప్రాంతంలో ఓ పాడుపడిన ఇంటి వెనుక ఆ పులి చనిపోయి కనిపించింది. ఆ పులిపై ఉన్న గాయాల ఆధారంగా, మరో క్రూరమృగం దాడిలో ఆ పులి మరణించి ఉంటుందని అంచనాకు వచ్చారు.
కాగా, ఆ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం నిర్వహించగా... ఆ పులి పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు కనిపించాయి. అవి ఇటీవల పులిదాడిలో మరణించిన రాధ అనే మహిళవని గుర్తించారు.
