Pawan Kalyan: అమెజాన్... ఇలాగైతే ఎలా...?: పవన్ కల్యాణ్

Pawan Kalyan urges Amazon over gift card issues

  • అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై స్పందించిన పవన్
  • గిఫ్ట్ కార్డుల్లో డబ్బు జమ చేయడం ఈజీయేనని వెల్లడి
  • కాలపరిమితి ముగిసిన గిఫ్ట్ కార్డుల నుంచి డబ్బు రికవరీ చేయడం కష్టమని వివరణ
  • ఈ విషయంలో అమెజాన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డుల్లో డబ్బు జమ చేయడం చాలా సులభమైన ప్రక్రియ అని, జమ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు కానీ, లేదా యూపీఐ సమాచారం కానీ ఎంటర్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ, కాలపరిమితి ముగిసిపోయిన గిఫ్ట్ కార్డ్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడమే అసలు సమస్య అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడానికి మాత్రం ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదని, కానీ కాలం చెల్లిన గిఫ్ట్ కార్డు నుంచి డబ్బు రికవరీ చేయడం మాత్రం అత్యంత కష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. యూజర్లు కస్టమర్ కేర్ ను కాంటాక్ట్ చేయాలి... వారి పరిస్థితిని వివరించాలి... ఆ తర్వాత ఎంతో సంక్లిష్టమైన సుదీర్ఘమైన ప్రక్రియను పూర్తి చేయాలి అని పవన్ వివరించారు. 

"కాలపరిమితి ముగిసిన గిఫ్ట్ కార్డు నుంచి డబ్బును వెనక్కి తీసుకునే ప్రక్రియ ఎందుకు సులభంగా, సరళతరంగా ఉండకూడదు? గిఫ్ట్  కార్డులో మనం ఉపయోగించుకోకుండా ఉన్న బ్యాలెన్స్ ఆటోమేటిగ్గా మన ప్రధాన ఖాతాలోకి గానీ, అమెజాన్ అకౌంట్ కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోకి గానీ ట్రాన్సఫర్ అయితే బాగుంటుంది. తద్వారా ఎంతో సమయం ఆదా అవడమే కాదు... యూజర్లు తమ గిఫ్ట్ కార్డుల్లోని నగదును కోల్పోకుండా ఉంటారు. 

ఈ-కామర్స్ వేదికలు తప్పనిసరిగా సులభతరమైన, పారదర్శకమైన, న్యాయమైన విధానాలను తీసుకురావాలి. యూజర్లకు కష్టం కలిగించని రీతిలో పరిష్కార మార్గాలు ఉంటే కోట్లాది మంది యూజర్లలో ఈ-కామర్స్ పోర్టళ్లపై నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే, కోట్లాది మంది యూజర్లు ఎదుర్కొంటున్న గిఫ్ట్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు సులువైన మార్గాన్ని అన్వేషించాలని అమెజాన్ ను కోరుతున్నా" అంటూ పవన్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. 

అంతేకాదు, తన పోస్టుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ట్యాగ్ చేశారు.

Pawan Kalyan
Amazon
Gift Card
  • Loading...

More Telugu News