Plots For All: ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

- అందరికీ ఇళ్లు పథకంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
- నేడు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- రెవెన్యూ మంత్రి చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
- కమిటీలో సభ్యులుగా పురపాలక, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, అధికారులు
'అందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రామాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వనున్నారు.
ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. పదేళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్టు వివరించారు. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలకు రూపకల్పన చేశారు. ఇంటిపట్టా ఇచ్చిన రెండేళ్ల లోగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటిస్థలం కేటాయిస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఇంకెక్కడా ఇంటిస్థలం, సొంత ఇల్లు ఉండకూడదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారులుగా ఉండరాదని తెలిపారు.
రెవెన్యూ మంత్రి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ ఈ అందరికీ ఇళ్లు పథకాన్ని పర్యవేక్షిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పురపాలక, హౌసింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు.వివిధ శాఖల మధ్య సమన్వయానికి అధికారుల కమిటీని కూడా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.