KTR: ఆ హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

- కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు చూసి మనకు కడుపు మంట అంటున్నారని ఆగ్రహం
- ఉద్యమం సమయంలో విద్యార్థుల పైకి రేవంత్ రెడ్డి తుపాకీ గురిపెట్టాడన్న కేటీఆర్
- రైతు భరోసాపై ఒకే ప్రసంగంలో రేవంత్ రెడ్డి రెండు మాటలు చెప్పారని విమర్శ
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'పెట్టుబడులను చూసి కడుపు మంటా? వాడండి ఈనో' అంటూ ఇటీవల ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఈ సిపాయిలు (కాంగ్రెస్ ప్రభుత్వం) తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట... మనం ఈనో తాగాలట అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉన్నాడని విమర్శించారు. ఏకంగా విద్యార్థుల పైకి తుపాకీ గురిపెట్టాడని ఆరోపించారు. తొమ్మిది నెలల పాటు ఓ తల్లి బిడ్డను ఎలా తన కడుపులో మోస్తుందో... అలాంటి ఇబ్బందులను బీఆర్ఎస్ ఉద్యమం సమయంలో పడిందన్నారు. 14 ఏళ్ల పాటు కేసులు ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, ఎన్నో అవమానాలు భరించి తెలంగాణను సాధించిందన్నారు. కానీ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటో చెప్పాలని నిలదీశారు.
రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువగా సంతోషిస్తామన్నారు. రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు అని గప్పాలు కొట్టడం సరికాదన్నారు. 2024లోనూ పెట్టుబడులు తెచ్చామంటూ ఇలాగే చెప్పారని, కానీ ప్రజలకు మీ మీద అనుమానాలు ఉన్నాయన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో... కాంగ్రెస్ పార్టీ 420 హామీల్లో వాస్తవం కూడా అంతే ఉంటుందన్నారు.
ప్రజల సొమ్ముతో హోర్డింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. అందులో మా బొమ్మలతో మీకేం పని... మీ బొమ్మలు పెట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే వారు చెప్పిన పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పని కంటే... ఎక్కువ పని చేస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు.
నిన్న కొడంగల్‍లో ఒకే ప్రసంగంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి రెండు మాటలు మాట్లాడారన్నారు. అపరిచితుడు సినిమాలో రాము, రెమోలా రేవంత్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా డబ్బులు రేపు తెల్లారేసరికి పడతాయని మొదట చెప్పారని, ఆ తర్వాత కాసేపటికే ఈ నెల 31 అని మాట మార్చాడన్నారు. కాంగ్రెస్ నేతల మాటలకు గ్యారెంటీ లేదన్నారు. ఓట్ల కోసమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటున్నారని ఆరోపించారు.