Shrasti Verma: ఆ కేసుతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు: కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ

- ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు వెనుక కుట్ర అంటూ ప్రచారం
- ఆ కుట్రలో అల్లు అర్జున్ ఉన్నారంటూ నెట్టింట పుకార్లు
- తాజాగా ఆ ప్రచారంపై స్పందించిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
- ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని.. అసలు బన్నీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
- తాను జానీ మాస్టర్‌పై కక్షతో కేసు వేయలేదని వెల్లడి
- తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా బయటకువచ్చానన్న కొరియోగ్రాఫర్
అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కావడం, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, జానీ మాస్టర్ అరెస్టు వెనుక కుట్ర జరిగిందని, ఆ కుట్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఆ ప్రచారంపై కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ స్పందించారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అసలు బన్నీకి దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
తాను జానీ మాస్టర్‌పై కక్షతో కేసు వేయలేదన్నారు. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా బయటకువచ్చానని తెలిపారు. ఓ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వాడుకుని.. తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా అని ఆమె ప్రశ్నించారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాను పెట్టిన కేసును రిటర్న్ తీసుకోవాలని తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని తెలిపారు. కానీ, ఆఫర్‌ను తాను తిరస్కరించానన్నారు. తాను ఎవరికీ భయపడే టైప్ కాదని తెలిపారు. ఇక లైంగిక వేధింపుల కేసు విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ శ్రష్టి వర్మ పేర్కొన్నారు.