Brazil: ప్రపంచమే విస్తుపోయేలా.. బ్రెజిల్ వలసదారులను అమెరికా ఎంత దారుణంగా వెనక్కి పంపిందో చూడండి!

Viral Video How Brazilians Deported From US Reached Home

  • నీళ్లు ఇవ్వకుండా, చేతులకు బేడీలు వేసి, విమానంలో ఏసీ ఆఫ్ చేసి పంపిన అమెరికా
  • బేడీలతో దిగిన తమ పౌరులను చూసి నిర్ఘాంతపోయిన బ్రెజిల్
  • వారి బేడీలు తొలగించి గౌరవంగా వారిని గమ్యాలకు తరలించాలని ఎయిర్‌ఫోర్స్‌కు అధ్యక్షుడి ఆదేశాలు
  • ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనంటున్న బ్రెజిల్
  • ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే వలసదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వారిని అత్యంత దారుణంగా వెనక్కి పంపిస్తోంది. తాజాగా పదుల సంఖ్యలో బ్రెజిల్ వలసదారులను వెనక్కి పంపింది. కనీసం నీళ్లు ఇవ్వకుండా, విమానంలో ఏసీ లేకుండా, చేతికి బేడీలు వేసి అత్యంత అవమానకరంగా పంపడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ పౌరులను అమెరికా వెనక్కి పంపిన తీరుపై బ్రెజిల్ తీవ్రంగా మండిపడింది. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

మానవహక్కులను దారుణంగా అవమానించారని, తమ పౌరులను అవమానకర పరిస్థితుల్లో వెనక్కి పంపారని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు విమానం దిగిన వెంటనే వారి చేతులకున్న బేడీలను తొలగించామని న్యాయశాఖమంత్రి రికార్డో లేవాండోవ్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

విమాన ప్రయాణంలో తమకు ఎదురైన దారుణ అనుభవాలను బాధితులు వర్ణించారు. అమెరికాలో తనను ఏడు నెలలు నిర్బంధంలో ఉంచారని కంప్యూటర్ టెక్నీషియన్ ఎడ్గార్ డా సిల్వామౌరా తెలిపారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం దారుణంగా ఉందని చెప్పారు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కాళ్లు, చేతులు కట్టేసి తమను విమానంలోకి ఎక్కించారని, మరుగుదొడ్లు ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీని ఆఫ్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డామని మరో బాధితుడు లూయిస్ ఆంటోనియో రోడ్రిగెస్ శాంటోస్ తెలిపారు. 

కాగా, బాధితులను తరలిస్తున్న విమానం బ్రెజిల్‌లోని ఉత్తర నగరమైన మనౌస్‌లో ల్యాండ్ అయింది. అందులో ప్రయాణించిన 88 మంది బ్రెజిల్ పౌరులు చేతులకు బంధనాలతో దిగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే వారికి వేసిన బేడీలను తొలగించి వారి గమ్యస్థానాలకు గౌరవంగా తరలించాలని అధ్యక్షుడు లులూ వైమానిక దళాన్ని ఆదేశించారు.

అక్రమ వలసలను అరికట్టేందుకు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ట్రంప్ కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ‘దక్షిణ సరిహద్దు వద్ద జాతీయ అత్యవసర స్థితి’ని ప్రకటించి సైన్యాన్ని నియమించారు. ఈ క్రమంలో అమెరికా నిబంధనలను ఉల్లంఘించిన 26 మంది వలసదారులను గ్వాటిమలా పంపారు. తమ పౌరుల విషయంలో అమెరికా వ్యవహరించిన విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అమెరికా కఠిన వలస విధానాలు ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయని బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాకు తన నిరసన వ్యక్తం చేసింది.

Brazil
USA
Deportion
Donald Trump
Viral Video

More Telugu News