indonesian president subianto: నాదీ భారతీయ డీఎన్ఏనే... ఇండోనేషియా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు

indonesian president subianto says i have indian dna

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి  
  • ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ప్రధాని మోదీ సహా పలువురు నేతల హాజరు
  • తన ప్రసంగంతో సభికులకు నవ్వులు పూయించిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తన మూలాలు భారత్‌లో ఉన్నట్లు వెల్లడయిందన్నారు. 
 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంలో ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. 
 
కొన్ని రోజుల క్రితం తాను జన్యు విశ్లేషణ (డీఎన్ఏ) పరీక్షలు చేయించుకోగా, అందులో తనది భారతీయ డీఎన్ఏగా తేలిందని సుబియాంతో పేర్కొన్నారు. భారతీయ సంగీతం వింటే తాను హుషారుగా నృత్యం చేస్తానని చాలా మందికి తెలుసునన్నారు. ఇది తన భారతీయ మూలాల్లో భాగమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సుబియాంతో మాటలతో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ సహా సభికులు పెద్దగా నవ్వేశారు. 

భారత్, ఇండోనేషియాకు పురాతన పరంగా సుదీర్ఘ చరిత్ర ఉందన్న ఆయన రెండు దేశాలకు నాగరిక సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచే వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ దేశంలో ఎంతో మంది పేర్లు సంస్కృతంలోనివేనని చెప్పారు. రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా కనబడుతోందన్నారు. మన జన్యువుల్లో ఇదొక భాగం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.  

indonesian president subianto
indian dna
Republic Day
  • Loading...

More Telugu News