Saif Alikhan: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో మరింతమంది ప్రమేయం!

- ఈ నెల 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడి చొరబాటు
- దొంగతనాన్ని అడ్డుకునే క్రమంలో నిందితుడి చేతిలో సైఫ్‌కు గాయాలు
- ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రలతో సరిపోలిన నిందితుడి ఫింగర్‌ప్రింట్స్
- ఈ నెల 29 వరకు నిందితుడి కస్టడీ పొడిగింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా తాజాగా ఇందులో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం అలియాస్ షెహ్‌జాద్ మహమ్మద్ రోహిల్లా అమిన్ ఫకీర్ అలియాస్ విజయ్‌దాస్ (30)ను ఈ నెల 19న థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 16న సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు దొంగతనం చేసే ప్రయత్నంలో సైఫ్‌పై కత్తితో దాడిచేసి ఆరు చోట్ల గాయపరిచాడు. ఈ కేసులో సాక్ష్యాలను బలపరిచేందుకు సైఫ్, ఆయన ఇంటి సిబ్బంది ధరించిన దుస్తులు, రక్తనమూనాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. నిందితుడి దుస్తులపై ఉన్న రక్తపు మరకలు సైఫ్‌వేనా అని నిర్ధారించేందుకు వారి దుస్తులు సేకరించారు. కాగా, ఘటన జరిగిన ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలు నిందితుడి ఫింగర్ ప్రింట్‌తో సరిపోలినట్టు సమాచారం. కాగా, సైఫ్‌పై దాడికి నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కాగా, నిందితుడు విచారణలో సహకరించని కారణంగా కోర్టు అతడికి ఈ నెల 29 వరకు కస్టడీని పొడిగించింది.