Tilak Varma: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ

- రెండో టీ20లో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించిన తెలుగు కుర్రాడు
- ఈ మ్యాచ్‌లో అజేయంగా 72 పరుగులు చేసిన తిలక్ వర్మ
- వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో 318 పరుగులు పూర్తి చేసిన తిలక్
- తద్వారా ఈ ఫార్మాట్‌లో కోహ్లీ వరుస నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 258 రన్స్‌ను వెనక్కి నెట్టిన తెలుగోడు
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయంగా 72 పరుగులు చేసి భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తాను మాత్రం నిలకడగా ఆడాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు మరిచిపోలేని గెలుపును అందించాడు. తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఇక ఈ ఇన్నింగ్స్ తర్వాత తిలక్ వర్మ పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ 318 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అతను ఇప్పుడు వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డును అధిగమించాడు.
ఈ ఫార్మాట్‌లో విరాట్ వరుస నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 258 రన్స్ చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 257 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో 300కి పైగా పరుగులు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్ కూడా తిలక్ వర్మనే కావడం విశేషం.
కాగా, గత నాలుగు ఇన్నింగ్స్‌లలో తిలక్ దక్షిణాఫ్రికాపై 107, 120 వరుస అజేయ సెంచరీలతో పాటు ఇంగ్లండ్‌పై 19, 72 (నాటౌట్) రన్స్ చేశాడు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం నాడు రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 జరగనుంది.