dr rajasekhar: కిడ్నీ రాకెట్ కేసులో కీలక వ్యక్తి అరెస్టు!

- కిడ్నీ రాకెట్ కేసులో దూకుడు పెంచిన రాచకొండ పోలీసులు
- శస్త్ర చికిత్సలో కీలకంగా వ్యవహరించిన వైద్యుడు రాజశేఖర్ అరెస్ట్
- చెన్నైలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలింపు
హైదరాబాదు కిడ్నీ రాకెట్ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో జరిగిన అనధికార కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు ఇదివరకే 9 మంది నిందితులను అరెస్టు చేయగా, తాజాగా శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషించారని అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యుడు రాజశేఖర్‌ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ రాజశేఖర్ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన రాచకొండ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు సమాచారం.
కిడ్నీ దానం చేసిన ఇద్దరు, గ్రహీతలు ఇద్దరూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. వారు ఇంకా నీరసంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాత వారి నుంచి వివరాలను పోలీసులు సేకరించే అవకాశం ఉంది. బాధితులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.