Pawan Kalyan: జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం

Pawan Kalyan crucial message to Janasena cadre
  • జనసైనికులకు, వీరమహిళలకు పవన్ బహిరంగ లేఖ
  • అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని సూచన
  • తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టీకరణ
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు కీలక సందేశం అందించారు. ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం... అంటూ బహిరంగ లేఖ రాశారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతిభద్రత వైఫల్యాలపై ప్రజలు విసుగుచెందారని పవన్ పేర్కొన్నారు. 

"అభివృద్ధికి తావులేకుండా చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంతో... ప్రజలు అనుభవం కలిగిన, భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించే నేతల కూడిన కూటమిపై నమ్మకం ఉంచారు. దాని ఫలితమే 94 శాతం విజయంతో 175కి 164 స్థానాలను ఎన్డీయే కూటమికి లభించాయి. అదే సమయంలో... జనసేన పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేట్ తో... పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో ఓటమి అనేది లేకుండా అన్నింటినీ గెలుచుకుంది. 

ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో... కేంద్రం సహాయసహకారాలతో చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. 

5 కోట్ల మంది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు పాతికేళ్ల భవిష్యత్తు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు, బహిరంగంగా చర్చించవద్దు. 

నేను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, ఇక ముందు కూడా అలాంటి రాజకీయాలు చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందాం" అంటూ పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Janasena
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News