Saif Ali Khan: సైఫ్ కేసుతో తన జీవితం నాశనం అయిందంటున్న డ్రైవర్

Driver said Saif case ruined his life

  • ముంబయిలో నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి
  • ఛత్తీస్ గఢ్ లో ఓ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అతడికేం సంబంధం లేదని ఆ తర్వాత వదిలేసిన వైనం
  • కానీ తన ఉద్యోగం పోయిందంటున్న డ్రైవర్
  • పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందని ఆవేదన 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో తొలుత ముంబయి పోలీసులు ఛత్తీస్ గఢ్ లో ఒక అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. అతడి పేరు ఆకాశ్ కనోజియా. అతడు ఒక డ్రైవర్. సైఫ్ ఇంట్లో లభ్యమైన సీసీటీవీ ఫుటేజిలో ఉన్న వ్యక్తికి, ఆకాశ్ కనోజియాకు పోలికలు ఉండడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారించుకుని ఆ తర్వాత వదిలేశారు. అంతవరకు బాగానే ఉంది. 

కానీ, సైఫ్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయడంతో తన జీవితం నాశనమైందని ఆ డ్రైవర్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు. "సైఫ్ కేసులో నన్ను ప్రధాన నిందితుడిగా భావించారు. మీడియాలో నా ఫొటోలు రావడం చూసి మా కుటుంబం తీవ్ర అవమానాలు ఎదుర్కొంది. నా పెళ్లి ఆగిపోయింది. కాబోయే భార్యను కలిసేందుకు వెళుతున్న నన్ను దుర్గ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు... వారు నన్ను కొట్టారు. 

పోలీసులు వదిలిపెట్టినా, అప్పటికే నాకు నష్టం జరిగింది. నా ఉద్యోగం పోయింది. నాతో పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు చేసిన తప్పుకు నేను మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సీసీటీవీ ఫుటేజిలో కనిపించిన వ్యక్తికి మీసాలు లేవు... నాకు ఉన్నాయి... పోలీసులు ఈ తేడా గుర్తించలేకపోయారు. అసలు నిందితుడు దొరకడంతో నేను బతికిపోయాను... లేకపోతే అన్యాయంగా నేను ఈ కేసులో ఇరుక్కుపోయేవాడిని. పోలీసులు చేసిన తప్పుకు నా జీవితం బలైంది" అని ఆకాశ్ కనోజియా వాపోయాడు. 

ఇక తాను సైఫ్ ఇంటి ముందు నిలబడి... తనను ఆదుకోవాలని, ఉద్యోగం ఇవ్వాలని వేడుకుంటానని ఆ డ్రైవర్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News