Revanth Reddy: మనం ఎన్నుకున్న సర్పంచి గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది?: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy take a jibe at KCR

  • నారాయణపేట జిల్లా కోస్గిలో సభ
  • కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు
  • ప్రతిపక్ష నేత సభకు రాని దుస్థితిని ఏమనాలి? అంటూ ఆగ్రహం
  • విపక్ష నేతగా బాధ్యత నిర్వరించనప్పుడు ఆ పదవి ఎందుకు? అంటూ ప్రశ్న

నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రతిపక్ష నేత సభకు రాని దుస్థితిని ఏమనాలి? విపక్ష నేతగా బాధ్యత నిర్వరించనప్పుడు ఆ పదవి ఎందుకు? మనం ఎన్నుకున్న సర్పంచి గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది? అంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయకపోగా... మేం ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

"మన ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నించాను. కానీ, మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకున్నారు. నా సోదరుడు ప్రజా సేవ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు... ఏం పదవి ఉందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం  లాగా... సోదరులు, బంధువులు అందరికీ పదవులు ఇస్తేనే మంచిదా? కేసీఆర్ లాగా కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని కాదు నేను. కేసీఆర్ కుమార్తె ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ చేశారు" అని విమర్శనాస్త్రాలు సంధించారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. అర్హులైన వారందరికీ తాము రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. 

"గ్రామ సభల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫాంహౌస్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజల వద్దకే పాలన వచ్చింది. ఎమ్మెల్యేలు, అధికారుల ప్రజల వద్దకే వెళుతున్నారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది. పేదలంతా ఎక్కడున్నా రేషన్ కార్డు తీసుకోవాలి. 

మా ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనుకంజ వేయదు. నాడు తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారు... ఇచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్... పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోయింది. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. కాళేశ్వరం కూలిపోయినా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది" అని వివరించారు.

Revanth Reddy
KCR
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News