Indrasena Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరో సంచలన విషయం

Tripura governor Indra Sena Reddy Phone tapped in Telangana

  • గత ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ జాబితాలోకి ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ నర్సింహులు నంబర్
  • రెండ్రోజుల క్రితం ఆయనను పిలిపించి విచారించిన దర్యాప్తు అధికారులు
  • ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం మీరు చెబితేనే తెలిసిందన్న నర్సింహులు
  • 2023 అక్టోబర్ 18న త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం
  • బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ట్యాపింగ్

గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతలు, పలువురు సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఓఎస్డీ జి.నర్సింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కేంద్రంగా ట్యాప్ చేసినట్టు గుర్తించారు. 

నర్సింహులు ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించిన అధికారులు రెండ్రోజుల క్రితం ఆయనను పిలిపించి విచారించారు. అయితే, తన ఫోన్ ట్యాప్ అయిన విషయం తనకు ఇప్పటి వరకు తెలియదని ఆయన చెప్పినట్టు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు ఈ నంబర్‌ను ట్యాప్ చేశారన్న విషయం విదేశాలకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారిస్తేనే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.

2023 నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నర్సింహులు ఫోన్ నంబరును ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, ఉమ్మడి ఏపీ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత ఆయన 2023 అక్టోబర్ 18న త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్‌ను ట్యాప్ చేస్తే కీలక రహస్యాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్‌కు పాల్పడినట్టు చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News