Tilak Varma: రెండో టీ20 కూడా భారత్‌దే.. బ్యాట్‌తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ

Tilak Varmas gear tweaks ushers India through testing terrain

  • రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు
  • ఓటమి తప్పదనుకున్న వేళ చెలరేగిన తిలక్‌వర్మ
  • అద్భుత పోరాట పటిమతో జట్టుకు విజయాన్ని అందించిన తిలక్
  • 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో తేలిగ్గా లొంగిపోయిన ఇంగ్లిష్ జట్టు ఈసారి చివరి వరకు పోరాడి ఓడింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ఆటలు సాగలేదు. చివరికి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది.  

ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టు 19 పరుగులకే ఓపెనర్లు సంజుశాంసన్ (5), అభిషేక్ శర్మ (12) వికెట్లను కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా ఆకట్టుకోలేకపోయాడు. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోనే చేరుకున్న భారత్ ఈసారి తడబడింది. వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. 
ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) కూడా తేలిపోయారు. అయితే, వాషింగ్టన్ సుందర్ మాత్రం కొంతవరకు పోరాడి 26 పరుగులు చేశాడు. ఇక ఓటమి ఖాయమనుకున్న వేళ మరో ఎండ్‌లో పాతుకుపోయిన తిలక్‌వర్మ ఆశలు పెంచాడు. 

సిక్సర్లు బాదుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆర్చర్, కార్స్‌ల బౌలింగ్‌లో ఆరు బంతుల వ్యవధిలో మూడు సిక్సర్లు బాది ఊపు తెచ్చాడు. వికెట్లు పడిపోతున్నా నిబ్బరంగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే, 17వ ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు రావడం, అర్ష్‌దీప్(6) ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. మ్యాచ్ చేజారినట్టే అనిపించింది. అయితే, బిష్ణోయ్ (9) సహకారంతో తిలక్ జట్టును గట్టెక్కించి విజయాన్ని అదించిపెట్టాడు. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. మొత్తంగా 55 బంతులు ఆడిన తిలక్ వర్మ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్లు సాల్ట్ (4), డకెట్ (3) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కుదురుకోవడంతో 9 ఓవర్లలో 74/3తో బలంగానే కనిపించింది. అయితే, నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న కెప్టెన్ జోస్ బట్లర్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపడంతో ఇంగ్లండ్ ఇబ్బందుల్లో పడింది. బట్లర్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. బట్లర్ తర్వాత కార్స్ చేసిన 31 పరుగులే జట్టులో అత్యధికం. 17 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు బాదాడు. జామీ స్మిత్ 22 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  కాగా, ఈ నెల 28న రాజ్‌కోట్‌లో ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది.

  • Loading...

More Telugu News