Padma Bhushan: ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సహా ఈ ఏడుగురికి పద్మవిభూషణ్

- అవార్డు బాధ్యతను పెంచిందన్న నాగేశ్వర్ రెడ్డి
- నాగేశ్వర్ రెడ్డి సహా ఏడుగురికి పద్మ విభూషణ్
- నాగేశ్వర్ రెడ్డికి, పద్మశ్రీ అందుకోనున్న మంద కృష్ణ మాదిగకు చంద్రబాబు అభినందనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్ ఏడుగురిని వరించింది. ఇందులో తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (మెడిసిన్) ఉన్నారు. తనకు పద్మవిభూషణ్ రావడంపై నాగేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. సమాజానికి, దేశానికి మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు.
నాగేశ్వర్ రెడ్డితో సహా ఏడుగురిని పద్మవిభూషణ్ వరించింది. జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజావ్యవహారాలు-చండీగఢ్), కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు-గుజరాత్), లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు-కర్ణాటక), ఎంటీవీ వాసుదేవన్ నాయర్ (మరణానంతరం, సాహిత్యం, విద్యలో-కేరళ), ఓసాము సుజుకీ (మరణానంతరం, వాణిజ్యం, పరిశ్రమలు-జపాన్), శారదా సిన్హా (కళలు-బీహార్) విభూషణ్ వచ్చిన వారిలో ఉన్నారు.
పద్మవిభూషణ్ అందుకోనున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు నిదర్శనమని, ఈ అవార్డు దేశానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి ఎనలేని గౌరవాన్ని తీసుకు వచ్చిందన్నారు.
మంద కృష్ణ మాదిగకు కూడా పద్మశ్రీ రావడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'దళితాభ్యుదయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నేత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, సోదరుడు మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు.' అంటూ ట్వీట్ చేశారు.