Delhi BJP: ఢిల్లీ ఎన్నికలు.. మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
- ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు విడుదల చేసిన బీజేపీ
- ప్రజలను ఆప్ మభ్యపెడుతోందన్న అమిత్ షా
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు శక్తివంచన లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేలా అన్ని పార్టీలు ఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నాయి.
ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే బీజేపీ రెండు మేనిఫెస్టోలను విడుదల చేసింది. తాజాగా మూడో మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు.
సంకల్ప్ పత్ర-3 పేరుతో మూడో మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోవని చెప్పారు. అన్ని హామీలను బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. అమిత్ షా విడుదల చేసిన మేనిఫెస్టోలో 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విజన్, కీలక వాగ్దానాలను పొందుపరిచారు.
మేనిఫెస్టో అంటే విశ్వతనీయత అని, తాము ఇచ్చినవి ఫేక్ వాగ్దానాలు కావని అమిత్ షా అన్నారు. 1.08 లక్షల మంది ప్రజలు, 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు.
ఢిల్లీ ప్రజలను ఆప్ మభ్యపెట్టే ప్రయత్నంచేస్తోందని అమిత్ షా విమర్శించారు. జల్ బోర్డ్ స్కామ్, డీటీసీ స్కామ్, సీసీటీవీ స్కామ్, మెడికల్ టెస్ట్ స్కామ్, ఎక్సైజ్ స్కామ్ వంటి కుంభకోణాల్లో ఆప్ చిక్కుకుందని అన్నారు. ఢిల్లీకి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే బీజేపీని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.