Monalisa Bhonsle: కుంభమేళా ‘మోనాలిసా’ సరికొత్త మేకోవర్!

- ప్రయాగరాజ్ లో పూసలు అమ్ముతూ ఆకట్టుకున్న యువతి
- జాతీయ స్థాయిలో వైరల్ గా మారిన ఆమె వీడియోలు
- తాజాగా మేకప్ వేయించుకుంటున్న వీడియో అప్ లోడ్ చేసిన మోనాలిసా భోంస్లే
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పూసలు అమ్ముతున్న సుందరి మోనాలిసా భోంస్లే.. అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎవరీ సుందరి అంటూ దేశవ్యాప్తంగా ఆమె గురించి సోషల్ మీడియాలో వెతికినవారు ఎందరో. ప్రయాగరాజ్ లో ఆమె పూసలు, దండలు అమ్ముతుండగా, ఆమెతో మాట్లాడుతూ తీసిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి కూడా. కేవలం కొన్ని రోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో ఫేమస్ అయిపోయింది. కుంభమేళాకు వెళ్లినవారు ఆమె ఎక్కడుందనేది తెలుసుకుని వెళ్లి సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు.
సొంతూరికి తిరిగి వెళ్లిపోయి...
పెద్ద సంఖ్యలో ఆమె వద్దకు రావడం ఇబ్బందిగా మారింది. పూసలు, దండలు అమ్మేపని పక్కనపడిపోయింది. దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్ కు పంపేశారనే వార్తలు వెలువడ్డాయి. అలాంటిది ఇప్పుడు మోనాలిసా భోంస్లే మరోసారి వైరల్ గా మారింది. ఈసారి తమ ఊరిలో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ‘ఎక్స్’లో పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్ కుపైగా వ్యూస్ వచ్చాయి.